న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. శుక్రవారం ఒకేరోజు దేశ రాజధాని ఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.1,200 ఎగబాకి రూ.75,550 పలికింది. దీంతో గత రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. అంతకుముందు ఇది రూ.74,350 వద్ద ఉన్నది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,300 ఎగబాకి రూ.74,450కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.1,200 అందుకొని రూ.68,250 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,599.70 డాలర్లు పలుకగా, వెండి 30.47 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
వెండి పరుగులు
బంగారంతోపాటు వెండి మరింత పరుగులు పెట్టింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి శుక్రవారం మరో అడుగుముందుకేసింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.2,000 ఎగబాకి రూ.89 వేలకు చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. గతంలో ఇది రూ. 87 వేలుగా ఉన్నది. గత నాలుగు రోజుల్లో వెండి ఏకంగా రూ.5,200 పెరిగినట్లు అయింది. ఇటు హైదరాబాద్లో రూ.3,500 అధికమైన కిలో ధర రూ.95 వేలకు చేరుకున్నది.
ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు వల్లే
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గిం చే అవకాశాలు మెండుగావున్నాయంటు వచ్చిన వార్తలు అంతర్జాతీయ మార్కెట్లో బం గారం ధర రికార్డు స్థాయికి చేరుకున్నది. ఈ నెల 18న తన సమీక్షను ప్రకటించనున్నది. దీనికి తోడు దేశీయంగా పండుగ, పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో ధరలు భారీగా పుంజుకున్నాయని ఓ వర్తకుడు వెల్లడించారు.