న్యూఢిల్లీ, జనవరి 12 : బంగారం, వెండి ధరలు మరోసారి ఆల్‌టైమ్ హై రికార్డులను నెలకొల్పాయి. సోమవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.2,900 పుంజుకొని తొలిసారి రూ.1,44,600 వద్ద నిలిచింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 26న నమోదైన రూ.1,42,300 రికార్డు కనుమరుగైంది. ఒక్క 2025లోనే తులం పసిడి విలువ రూ.58,750 ఎగబాకడం గమనార్హం.
హైదరాబాద్‌లోనూ గోల్డ్ రేట్లు పరుగులు పెట్టాయి. మార్కెట్‌కు సంక్రాంతి కళ ముందే వచ్చిందా? అన్నట్టుగా 24 క్యారెట్ బంగారం తులం రూ.1,42,150 పలికింది. గతంతో పోల్చితే రూ.1,690 పెరిగింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పసిడి ధర రూ.1,550 ఎగిసి రూ.1,30, 300గా ఉన్నది. కాగా, బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది వెండిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వ్యాపారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా మదుపరుల నుంచి సిల్వర్‌కు డిమాండ్ కనిపిస్తున్నదని వారు వివరిస్తున్నారు. గత సంవత్సరం కిలో వెండి ధర రూ.1,49,300 ఎగిసిన విషయం తెలిసిందే.
వెండి ధర ఈ ఒక్కరోజే ఏకంగా రూ.15,000 ఎగబాకింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రూ.2,65,000 పలికింది. భారతీయ మార్కెట్లో ఇప్పటికైతే ఇదే ఆల్‌టైమ్ హై రికార్డు. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచి వెండికి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. దీంతో రేట్లు పరుగులు పెడుతున్నాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ ప్రస్తుత ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నది. సోలార్, ఎలక్ట్రానిక్ తదితర రంగాల నుంచి ఆదరణ ఎక్కువగా కనిపిస్తున్నట్టు పేర్కొన్నది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్‌కు గిరాకీ పెరిగింది. ఔన్స్ బంగారం తొలిసారి 4,600 డాలర్లను దాటింది. 4,601.69 డాలర్లు పలికింది. ఒక్కరోజే 90.72 డాలర్లు ఎగిసింది. ఇక ఔన్స్ వెండి ధర కూడా 84.61 డాలర్లుగా నమోదైంది. గతంతో పోల్చితే 4.3 డాలర్లు పెరిగింది. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గించబోతున్నదన్న అంచనాలే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమీ పావెల్ మధ్య తీవ్రతరమైన వైరం.. బులియన్ మార్కెట్లో ధరలను ఇంకా ఎగదోసే వీలుందని అంటున్నారు.