న్యూఢిల్లీ, ఆగస్టు 29 : బంగారం భగ భగమండుతున్నది. ఇప్పటికే చారిత్రక గరిష్ఠ స్థాయికి దూసుకుపోయిన విలువైన లోహాల ధర మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు రూపాయి గింగిరాలు కొట్టడంతో బంగారం మరో రికార్డు స్థాయికి చేరుకున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర శుక్రవారం ఒకేరోజు రూ.2,100 ఎగబాకి రూ.1,03,670 పలికింది. ఒకేరోజు ఇంతటి భారీ స్థాయిలో పెరిగిన స్థాయిలో ఇది కూడా ఒకటని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర గురువారం రూ.1,01,570గా ఉన్న విషయం తెలిసిందే.
వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి శుక్రవారం రూ.2 వేల పైకి ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నదని బులియన్ వర్తకులు వెల్లడించారు. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బం గారం ధర కూడా అంతే స్థాయిలో పెరిగి రూ.1,03,000గా నమోదైంది. ఈ నెల మొదట్లో గోల్డ్ ధర రికార్డు స్థాయిలో రూ. 3,600 పెరిగిన విష యం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 మార్క్‌కి చేరుకోవడం పుత్తడికి పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఈ వారంలో బంగారం ధర రూ.3,300 లేదా 3.29 శాతం ఎగబాకింది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం గోల్డ్ ధర రూ.710 అధికమై రూ.1,03, 310 పలికింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.650 ఎగబాకి రూ.94,700గా నమోదైంది.
బంగారం ఒకవైపు పరుగులు పెడుతుంటే వెండి మాత్రం భారీగా తగ్గింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.1,19,000కి పరిమితమైంది.