న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ధరలు పుంజుకోవడంతో దేశీయంగా పుత్తడి ధర మళ్లీ రూ.89 వేల మార్క్‌ను అధిగమించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.350 ఎగబాకి రూ.89,100కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. గత శుక్రవారం గోల్డ్ రూ.88,750గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే 99.5 శాతం కలిగిన పదిగ్రాముల ధర రూ.88,700కి చేరుకున్నది. అయినప్పటికీ వెండి ధరలు నిలకడగా నమోదయ్యాయి. కిలో వెండి లక్ష రూపాయల వద్ద స్థిరంగా ఉన్నది. రాజకీయ ఆస్థిరత, వాణిజ్య ఉద్రిక్తత నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.