న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ దిగుమతులు మాత్రం తగ్గడం లేదు. గత నెలలో భారత్లోకి 4.47 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడి దిగుమతి అయింది. క్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతైన దాంతో పోలిస్తే 192 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలలేదన్నడానికి ఈ దిగుమతులే నిదర్శణమని పేర్కొంది. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, బ్యాంకుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం, ధరలు రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ కొనుగోళ్లు తగ్గడం లేదని వెల్లడించింది.
ఇదే క్రమంలో గురువారం బంగారం ధర రికార్డు స్థాయి రూ.98,170 పలికిన విషయం తెలిసిందే. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరం(2024-25, ఏప్రిల్ నుంచి మార్చి మధ్యకాలంలో) పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 27.27 శాతం ఎగబాకి 58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2023-24లో ఇది 45.54 బిలియన్ డాలర్లు ఉన్నాయి. వెండి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. డాలర్ బలహీనపడటం, వాణిజ్య యుద్ధ భయాలు మరింత ముదురుతుండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుతో అంతర్జాతీయ దేశాలు ఆనిశ్చిత పరిస్థితికి గురవుతున్న ప్రస్తుత తరుణంలో అతి విలువైన లోహాలు ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.
స్విట్జర్లాండ్ నుంచి భారత్ అత్యధికంగా పసిడి దిగుమతి చేసుకుంటున్నది. మొత్తం దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి వస్తుండగా, యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున దిగుమతి అవుతున్నాయి. 2023-24లో 795.32 టన్నుల బంగారం దిగుమతి కాగా, 2024-25లో 757.15 టన్నులకు పడిపోయింది.
వెండి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. మార్చి నెలలో వెండి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 85.4 శాతం తగ్గి 119.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2024-25లో వెండి దిగుమతులు 11.24 శాతం తగ్గి 4.82 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కిలో వెండి ధర రూ.1,400 తగ్గి రూ.98 వేలకు పరిమితమైంది.
బంగారం భారీగా దిగుమతి కావడంతో మళ్లీ వాణిజ్యలోటు రికార్డు స్థాయికి చేరుకున్నది. గత నెలలో వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదవగా, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి 282.82 బిలియన్ డాలర్లుగా ఉన్నది. చైనా తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న భారత్లో ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఇది అధికంగా ఉంటుందని ఆభరణాల వర్తకులు పేర్కొన్నారు.