న్యూఢిల్లీ, జనవరి 22: బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ హైని తాకింది. బుధవారం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ 10 గ్రాములు రూ.82,730 పలికింది. ఈ ఒక్కరోజే రూ.630 పెరిగింది. నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి పుత్తడి కొనుగోళ్లకు డిమాండ్ కొనసాగుతుండటంతో మార్కెట్లో రేట్లు పరుగులు పెడుతున్నాయి. నిజానికి గత ఆరు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హైకి చేరాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సైతం కలిసొచ్చాయని ఈ సందర్భంగా అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నది.
3 నెలల తర్వాత..
మార్కెట్లో పసిడి ధరలు ఆల్టైమ్ హైల్లో కదలాడటం దాదాపు 3 నెలల తర్వాత ఇప్పుడే. గత ఏడాది అక్టోబర్ 31న 24 క్యారెట్ గోల్డ్ తులం రేటు తొలిసారి రూ.82,400గా నమోదైంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆ స్థాయిని ధరలు దాటిన దాఖలాలు లేవు. కానీ బుధవారం ఆ రికార్డు చెరిగిపోయి కొత్త రికార్డు నమోదైంది. కిలో వెండి ధర కూడా ఈ ఒక్కరోజే రూ.1,000 పుంజుకున్నది. రూ.94,000 పలికింది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 10.20 డాలర్లు పెరిగి 2,769.40 డాలర్లుగా ఉన్నది. ఔన్స్ సిల్వర్ 31.58 డాలర్లు పలికింది.
హైదరాబాద్లో..
హైదరాబాద్లో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) పుత్తడి రేటు రూ.82,090గా ఉన్నది. మంగళవారంతో పోల్చితే రూ.860 ఎగిసింది. 99.5 స్వచ్ఛత (22 క్యారెట్) కలిగిన ఆభరణాల బంగారం ధర రూ.750 ఎగబాకి తులం రూ. 75,250గా ఉన్నది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై ఫ్యూచర్స్ ట్రేడ్లో గోల్డ్ కాంట్రాక్ట్లు ఫిబ్రవరి డెలివరీకిగాను రూ.299 లేదా 0.38 శాతం పెరిగింది. తులం రూ.79,523గా నమోదైంది. సిల్వర్ ఫ్యూచర్స్.. మార్చి డెలివరీకిగాను రూ.204 లేదా 0.22 శాతం ఎగిసి కిలో రూ.92,295గా ఉన్నది.
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల చుట్టూ నెలకొన్న అనిశ్చితి మదుపరుల పెట్టుబడులను పుత్తడి దిశగా తీసుకెళ్తున్నది. తాజాగా ధరల పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే.
-సౌమిల్ గాంధీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ విశ్లేషకుడు