హైదరాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆ మధ్య ఆల్‌టైమ్ హై రికార్డులతో హోరెత్తించినా.. ఆ తర్వాత వరుసగా క్షీణించాయి. కానీ తిరిగి పరుగులు పెట్టిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు పతనం దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా రూ.1,310 పడిపోయింది. రూ.77,240 వద్ద స్థిరపడింది. సోమవారం కూడా రూ.1,090 కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక 22 క్యారెట్ రేటు ఈ ఒక్కరోజే రూ.1,200 తగ్గి 10 గ్రాములు రూ.70,800 వద్ద నిలిచింది. అంతకుముందు రోజు రూ.1,000 పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి విలువ రూ.1,250 క్షీణించి రూ.78,150 పలుకుతున్నది. సోమవారం రూ.1,000 తగ్గిన సంగతి విదితమే. అలాగే కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.90,600లుగా ఉన్నది. మునుపటి రోజు రూ.1,600 పడిపోయింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ బలోపేతం.. గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నది.