న్యూఢిల్లీ, మార్చి 24: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తిరోగమనబాట పట్టాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.700 దిగొచ్చింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.90,550కి తగ్గినట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎట్టకేలకు ముగింపు పలికే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్ నుంచి ఈక్విటీల్లోకి మళ్లించడం వల్లనే ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. దీంతో ధరలు వరుసగా మూడు రోజు తగ్గాయి. మరోవైపు, వెండి ధరలు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.200 అందుకొని రూ.1,00,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,028.90 డాలర్లు పలుకగా, వెండి 30 డాలర్లకు పైగా కొనసాగుతున్నది.