న్యూఢిల్లీ, జూన్ 20: బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవడంతో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. పదిగ్రాముల బంగారం ధర లక్ష రూపాయల కిందకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.600 దిగొచ్చి రూ.99,960గా నమోదైంది.
ధరలు తగ్గకముందు బంగారం ధర రూ.1,00,560గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.550 తగ్గి రూ.99,250గా నమోదైంది. పుత్తడితోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈవారంలో రికార్డు స్థాయికి చేరుకున్న కిలో వెండి ధర రూ.2,000 తగ్గి రూ.1,05,200గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ధరలు తగ్గడానికి కారణమని బులియన్ వర్గాలు వెల్లడించాయి.