న్యూఢిల్లీ, ఆగస్టు 9: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి సోమవారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర మరో రూ.310 తగ్గి రూ.45,400కి దిగొచ్చింది. అంతకుముందు ఈ ధర రూ.45,710గా ఉన్నది. అటు హైదరాబాద్‌లోనూ అతి విలువైన లోహం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.530 తగ్గి రూ.47,300 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,728 డాలర్లకు పడిపోగా, వెండి కూడా 23.91 డాలర్ల వద్దకు చేరింది. అమెరికాలో ఉద్యోగ కల్పన జోరందుకోవడం, యూఎస్ ఫెడరల్ రిజర్వు త్వరలో వడ్డీరేట్లను పెంచవచ్చనే అనుమానాలు ఉదృతం కావడం వల్లనే పసడి ధరలు దిగొస్తున్నాయని హెచ్డీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో రూ.770 తగ్గి రూ.45,900 వద్ద ట్రేడ్ అవుతున్నది.