Gold Rates | యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో బంగారం ధర ధగధగ మెరుస్తోంది. దీనికి తోడు దేశీయంగా ఫెస్టివల్ సీజన్, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో పుత్తడి ధర సరికొత్త పుంతలు తొక్కుతున్నది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.700 పెరిగి రూ.76,350లకు చేరుకున్నది. గురువారం పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.75,650 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు, గోల్డ్ కాంట్రాక్ట్స్ అక్టోబర్ డెలివరీ ధర రూ.341 వృద్ధితో రూ.73,779 పలికింది. కిలో వెండి కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర రూ.145 పుంజుకుని రూ.90,113లకు చేరుకున్నది. గత నెలలో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతి జిరగిన సంగతి తెలిసిందే.
దిగుమతి సుంకాలు భారీగా తగ్గించడంతో ఆగస్టు నెలలో 10.06 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టు నెలలో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం బంగారం, వెండిలపై దిగుమతి సుంకాన్ని 15 నుంచి ఆరు శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. చైనా తర్వాత బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారత్. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 2,632.90 డాలర్లు పలికింది. యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించిన తర్వాత బంగారం ధర ఒక శాతానికి పైగా పెరిగింది. ఔన్స్ వెండి ధర 31.54 డాలర్లు పలికింది.