Gold Loans | అత్యవసర పరిస్థితుల్లో తలెత్తే ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఒక్కోసారి బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాల్సి వస్తుంది. బంగారం తాకట్టు రుణాలు సురక్షితమైనా.. ఈ రుణాలను వాయిదాలపై చెల్లించే ఫెసిలిటీ లేదు. ఈ నేపథ్యంలో బంగారం రుణాలను ఈఎంఐల్లో చెల్లించే పద్ధతిని అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రుణాల మంజూరు విషయంలో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నదని వార్తలొచ్చాయి. ప్రస్తుతం బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బంగారం తాకట్టుపై ఇచ్చే రుణాల చెల్లింపునకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత రుణ గ్రహీత తాను తీసుకున్న మొత్తం రుణం ఒకేసారి చెల్లించే విధానమే బుల్లెట్ పేమెంట్. అలా కాకుండా గడువుకు ముందే నిధులు అందుబాటులో ఉంటే అసలూ వడ్డీ చెల్లించి రుణ గ్రహీత తాను తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునే సౌకర్యం ఉంటుంది.
బంగారం రుణాల మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆర్బీఐ ఇటీవల గుర్తించింది. బంగారం విలువ నిర్ధారణలో లోపాలు, వేలంలో పారదర్శకత లేమి వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు రుణ గ్రహీతలు వడ్డీ చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. అందువల్లే బంగారం తాకట్టుపై రుణాలకూ ఈఎంఐ ఆప్షన్ అమల్లోకి తెచ్చే విషయం పరిశీలిస్తున్నామని ఇటీవల జారీ చేసిన సర్క్యులర్లో ఆర్బీఐ పేర్కొన్నట్లు సమాచారం. గత సెప్టెంబర్ 20కల్లా బ్యాంకులన్నీ సుమారు 1.4 లక్షల కోట్ల విలువైన బంగారం రుణాలు మంజూరు చేశాయని ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 14.6 శాతం ఎక్కువ.