Gold Loans | ముంబై, నవంబర్ 30: బంగారంపై రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరిగారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు, అత్యవసర అవసరాలకోసం బంగారమే పరమావధిగా కనిపిస్తున్నది. సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వరకు బంగారం ఉంటేచాలు బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలకాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ఈ రుణాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను కూడా నెలకొల్పాయి.
దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన ఏడు నెలల్లో(ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) బంగారం తాకట్టుపై రుణాలు 50 శాతం మేర పెరిగాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 18, 2024 నాటికి పసిడి రుణాలు రూ.1,54,282 కోట్లుగా ఉన్నాయి. మార్చి 2024 నాటికి మొత్తం బంగారం రుణాలు రూ.1,02,562 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైనదాంతో పోలిస్తే గోల్డ్ లోన్లు 56 శాతం అధికమయ్యాయి.
గడిచిన ఏడు నెలల్లో బంగారం రుణాలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయని, ఇందుకు ప్రధాన కారణం ఎన్బీఎఫ్సీ సంస్థలు అన్సెక్యూర్డ్ లోన్ల కంటే సెక్యూర్డ్ లోన్లపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే పెరిగాయని బ్యాంకర్ వెల్లడించారు. అలాగే బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోవడంతో రుణ గ్రహీతలు బంగారాన్ని తాకట్టుపెట్టుకొని ఇతర రుణాలను తీర్చుకుంటున్నారని తెలిపారు. పసిడి రుణాల పాలసీలు, విధానాల్లో లోపాలు ఉంటే వచ్చే మూడు నెలల్లో సరిదిద్దుకోవాలని గత నెలలో రిజర్వు బ్యాంక్ అన్ని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు సూచించింది.
బంగారం రుణాలతోపాటు గృహ రుణాలకు కూడా డిమాండ్ నెలకొన్నది. గత నెల చివరినాటికి దేశవ్యాప్తంగా రూ.28.7 లక్షల కోట్ల గృహ రుణాలు తీసుకున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 12.1 శాతం పెరిగాయి. దీంతోపాటు క్రెడిట్ కార్డు ద్వారా తీసుకునే రుణాలు ఏడాది ప్రాతిపదికన 9.2 శాతం ఎగబాకి రూ.2.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆన్లైన్ ద్వారా జరిపే లావాదేవీలు అధికంగా ఉండటం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
బంగారం రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు తీసుకునేవారు తగ్గుముఖం పడుతున్నారు. ముఖ్యంగా ఈ రుణాలపై రిజర్వు బ్యాంక్ షరతులు విధించడంతో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఇవ్వడానికి జంకుతున్నాయి. ఇటీవలకాలంలో దేశవ్యాప్తంగా వ్యక్తిగత రుణాలు మొండి బకాయిలు అధికంగా ఉండటంతో సెంట్రల్ బ్యాంక్ పలు కీలక చర్యలు తీసుకున్నది. దీంతో వ్యక్తిగత రుణాలు 3.3 శాతం తగ్గాయని తెలిపింది. మొత్తంమీద బ్యాంకింగ్ రుణాలు 4.9 శాతం అధికమై రూ.172.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి.