Gold Rates | పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కావడంతో రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి గిరాకీ పెరగడంతో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తిరిగి ధగధగ మెరుస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.600 వృద్ధితో రూ.78,050లకు చేరుకుంది. సోమవారం తులం బంగారం ధర రూ.77,450 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర బుధవారం రూ.1,500 పుంజుకుని రూ.93,500 వద్ద ముగిసింది. సోమవారం కిలో వెండి ధర రూ.92 వేలు పలికింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.600 పెరిగి రూ.77,650 వద్ద నిలిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ బంగారం తులం ధర రూ.615 వృద్ధితో రూ.75,662లకు చేరుకున్నది. అలాగే డిసెంబర్ డెలివరీ వెండి కాంట్రాక్ట్స్ ధర రూ.677 వృద్ధితో రూ.91,190 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 19.50 డాలర్లు పెరిగి 2,634.10 డాలర్ల వద్ద స్థిర పడింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. కామెక్స్ సిల్వర్ లో ఔన్స్ వెండి ధర 0.79 శాతం పెరిగి 31.47 డాలర్లకు చేరుకున్నది. పరిస్థితులు ఇలాగే కొనసాగడంతోపాటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తే 2025 డిసెంబర్ నెలాఖరు నాటికి ఔన్స్ బంగారం ధర 3000 డాలర్లకు దూసుకెళ్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ గోల్డ్ మాన్ సాచెస్ అంచనా వేసింది. వివిధ కేంద్రీయ బ్యాంకుల నుంచి డిమాండ్ రావడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం అని పేర్కొంది.