న్యూఢిల్లీ, మే 2: పసిడి దిగుమతులు క్రమంగా పడిపోతున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల కారణంగా దేశవ్యాప్తంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్యులు జంకుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో దిగుమతులు దిగువముఖం పడుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో దిగుమతైన అతి విలువైన లోహం..ఈ ఏడాది తొలి నెలలోనే 30 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత నెలలో కేవలం 15 టన్నుల బంగారాన్ని మాత్రమే భారత్ దిగుమతి చేసుకోవడం విశేషం. గరిష్ఠ స్థాయి ధరల కారణంగా బ్యాంకులు కొనుగోళ్లను నిలిపివేయడం కూడా మరో కారణం. అలాగే దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర సర్కార్ అధిక సుంకాన్ని వసూలు చేయడం కారణమని బులియన్ వర్తకులు వెల్లడిస్తున్నారు. భారత్‌లో వినియోగించే పుత్తడిలో అధిక శాతం బ్యాంకులు దిగుమతి చేసుకుంటున్నవే.
అత్యంత విలువైన లోహాలపై ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(ఐజీఎస్టీ)ని 3 శాతం విధించినప్పటి నుంచి బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. దేశంలో శుద్ధి చేసిన బంగారంలో అధిక భాగం బ్యాంకుల ద్వారా దిగుమతి అవుతున్నది. అయితే దేశీయ కస్టమ్స్ అధికారులు ఈ లోహంపై 3 శాతం సమీకృత వస్తు, సేవల పన్నును విధించడం ప్రారంభించినప్పటి నుంచి బ్యాంకులు రవాణాను పూర్తిగా నిలిపివేశాయని ఇండియా బులియన్ అండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. 2017లో భారత్..ఐజీఎస్టీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో దిగుమతి చేసుకున్న బంగారంపై 3 శాతం పన్ను మినహాయింపునిచ్చేవారు. ప్రస్తుతం ఈ పన్నును విధించినప్పటి నుంచి పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో గోల్డ్ దిగుమతులపై బ్యాంకులు ఎలాంటి చెల్లింపులు జరుపలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్..ఏప్రిల్ 2025లో 35 టన్నుల గోల్డ్‌ను దిగుమతి చేసుకున్నది. సరాసరిగా గతేడాది నెలకు 60 టన్నుల చొప్పున ఇంపోర్ట్ చేసుకున్నది.