Gold Rate | అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ధగధగమని మెరుస్తున్నాయి. గురువారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ. 17 వృద్ధితో రూ.82,900లకు చేరుకుని తాజాగా మరో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బుధవారం తులం బంగారం ధర రూ. 82,730 వద్ద ముగిసింది. గతేడాది ఫిబ్రవరి 23న రూ.62,720 పలికిన పది గ్రాముల బంగారం ధర గురువారం (2025 జనవరి 23) రూ.82,900 పలికింది. అంటే 11 నెలల్లోనే బంగారం బంగారం తులం ధర రూ. 20,180 (32.17 శాతం) పెరిగింది. వరుసగా ఏడో సెషన్లోనూ 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.170 పెరిగి రూ.82,500లతో తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బుధవారం ఇదే బంగారం తులం ధర రూ.82,330 స్థిర పడింది. గత ఏడు సెషన్లలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.2,320 చొప్పున వృద్ధి చెందింది.
ఇదిలా ఉంటే గురువారం కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.93,500 పలికింది. బుధవారం కిలో వెండి ధర రూ.94,000 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ గల బంగారానికి దేశీయ బులియన్ మార్కెట్లో రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గురువారం గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.19 (0.02 శాతం) పెరిగి రూ.79,583లకు చేరుకుంది. మరోవైపు కిలో వెండి ఫ్యూచర్స్ ధర రూ.422 (0.46 శాతం) తగ్గి రూ.91,522 లకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,944 వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయ మార్కెట్లలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 13.20 డాలర్లు (0.48 శాతం) తగ్గి 2,757.70 డాలర్లకు చేరుకుంది. యూఎస్ డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరల్లో రికవరీతో బంగారం ధరలు ఫ్లాట్ నుంచి నెగెటివ్‌గా మారాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. బుధవారం యూఎస్ డాలర్ ఇండెక్స్, ట్రెజరీ బాండ్లు పాజిటివ్‌గా ముగిశాయి. దీనివల్ల గురువారం బంగారం ధర పెరిగిందని సౌమిల్ గాంధీ తెలిపారు. వచ్చే ఒకటి, రెండు రోజుల్లో బంగారం రికార్డు గరిష్టాలకు చేరుతుందని అగుమెంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనానీ చెప్పారు.
వివిధ దేశాల నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోవడానికి కారణమయ్యాయి. సిల్వర్ కామెక్స్‌లో ఔన్స్ వెండి ధర 1.03 శాతం పతనంతో 31.10 డాలర్లు పలికింది. కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారని రెనిషా చైనానీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించే విధానాలతో ద్రవ్యోల్బణం పెరిగిపోయే అవకాశం ఉందని, యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చునని చెప్పారు. ప్రపంచంలోనే కెనడాలోనే ఎక్కువగా వెండి తయారవుతుంది. మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వెండిపై ట్రంప్ సుంకాలు విధిస్తారా..? లేదా..? అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.