Gold Rate | బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల వరుసగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరుగుతున్నాయి. మరోసారి ధర భారీగా పెరిగి సరికొత్త గరిష్ఠానికి చేరింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం రూ.458 పెరిగి తొలిసారిగా తులానికి రూ.1,10,047 పెరిగి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగడం, యూఎస్ డాలర్ బలహీనపడడం కారణంగా పసిడికి డిమాండ్ పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.458 (0.41శాతం) పెరిగి తులానికి రూ.1,10,047కి చేరుకుంది. అక్టోబర్ డెలివరీకి సంబంధించి 0.44శాతం పెరిగి తులానికి రూ.1,09,000 రికార్డు స్థాయికి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగి కొత్త శిఖరాలను చేరాయి. యూఎస్ మార్కెట్ కామెక్స్‌లో డిసెంబర్ డెలివరీకి సంబంధించి గోల్డ్ ఔన్స్‌కు 3,694.75 డాలర్లకు చేరింది. ఇప్పటికీ వరకు ఇదే అత్యధికం. రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది మాట్లాడుతూ.. యూఎస్ డాలర్ బలహీనంగా ఉండడమే కారణమన్నారు. ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బంగారం డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఎందుకంటే బంగారం పెట్టుబడిదారులకు పసిడి మరింత ఆకర్షణీయంగా ఉంటుందని.. డాలర్ బలహీనపడడంతో బంగారానికి డిమాండ్ వస్తుంది.
డాలర్ బలహీనపడిన సమయంలో ఇతర కరెన్సీల్లో బంగారం కొనడం చౌకగా ఉంటుందని, అంతర్జాతీయంగా డిమాండ్ పెంచడంతో పాటు ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వేగంగా పెరుగుతున్న ధరలు పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు సైతం ఉత్సాహంగా ఉన్నారని మార్కెట్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారని పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో బంగారు ఆభరణాల ధరలు పైతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో భారీగా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారిపై ధరల పెరుగుదల వారిపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది.