Gold Hallmarking | ఇప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది కేంద్రం. తెలంగాణలో ఇంతకుముందు ఏడు జిల్లాల్లో మాత్రమే హాల్ మార్కింగ్ నిబంధన అమల్లోకి వచ్చింది. తాజాగా కేంద్రం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 55 జిల్లాల్లో హాల్ మార్కింగ్ పాలసీని కేంద్రం విస్తరించింది. దీంతో తెలంగాణలో కొత్తగా ఐదు జిల్లాల్లో బంగారం ఆభరణాలు విక్రయించాలంటే హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఇంతకుముందు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో.. హాల్ మార్కింగ్ నిబంధన అమలు కాగా, తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలు చేరాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 17 జిల్లాల్లో ఈ నిబంధన అమలవుతుంది. ఇంతకుముందు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూల్, అనంతపూర్ జిల్లాల్లో అమలు కాగా, తాజాగా అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు జత కలిశాయి.
2021 జూన్ 16 వరకూ స్వచ్ఛందంగా బంగారం ఆభరణాలపై హాల్ మార్కింగ్ నిబంధన అమలు చేయాలని బంగారం ఆభరణాల దుకాణాలను ఆదేశించిన కేంద్రం.. అదే నెల 23న తొలిసారి దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. నాటి నుంచి దశల వారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. మలి దశలో 2022 ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి 32 జిల్లాలు, తాజాగా మూడో దశలో 55 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి చేశారు.
ప్రస్తుతం ప్రతి రోజూ నాలుగు లక్షల బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ జరుగుతున్నదని కేంద్రం వెల్లడించింది. రిజిస్టర్డ్ బంగారం ఆభరణాల దుకాణాలతోపాటు హాల్ మార్కింగ్ పరీక్ష, హాల్ మార్కింగ్ కేంద్రాలు కూడా పెరిగాయి. బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ నిబంధన అమలుకు నోడల్ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనలు సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపింది.