Gold Rates | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తళతళ మెరుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం పది గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర రూ.450 పెరిగి రూ.64,300లకు చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ నెల నాలుగో తేదీన తులం బంగారం రూ.64,300లకు చేరుకున్న తర్వాత రికార్డు స్థాయికి పెరగడం ఇది రెండోసారి. బుధవారం తులం బంగారం ధర రూ.63,850 వద్ద ముగిసింది.
కిలో వెండి ధర సైతం రూ.400 పెరిగి రూ.79,500 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2080 డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.31 డాలర్లు పలికింది. వచ్చే ఏడాది నుంచి కీలక వడ్డీరేట్ల తగ్గింపు విషయమై యూఎస్ ఫెడ్ రిజర్వ్ దూకుడుగా వ్యవహరించనున్నదన్న సంకేతాల మధ్య డాలర్ ఇండెక్స్, అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.156 పతనమై రూ.63,522 వద్ద ముగిసింది. న్యూయార్క్ లోనూ ఔన్స్ బంగారం ధర 0.27 శాతం పతనమై 2087.50 వద్ద స్థిర పడింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.450 పుంజుకుని రూ.59,450 వద్ద స్థిర పడింది. 24 క్యారెట్స్ బంగారం రూ.490 పెరిగి రూ.64,850 వద్ద నిలిచింది. డిసెంబర్ నాలుగో తేదీన తులం (24 క్యారెట్స్) బంగారం రూ.65,180, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం ధర రూ.59,750 పలికింది. కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.81 వేల వద్ద స్థిర పడింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం రూ.400 పెరిగి రూ.58,900 పలికితే, 24 క్యారెట్స్ బంగారం ధర రూ.430 పుంజుకుని రూ.64,250 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.81 వేల వద్ద ముగిసింది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో 22 క్యారెట్స్ బంగారం రూ.400 పుంజుకుని రూ.58,900 వద్ద ముగిసింది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.430 పెరిగి రూ.64,250 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.77 వేలు పలుకుతున్నది. ముంబైతోపాటు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో రూ.300 పెరిగి కిలో వెండి ధర రూ.79,500 వద్ద స్థిర పడింది.