Gold Rates | గ్లోబల్ మార్కెట్లో సానుకూల పరిస్థితులతో దేశీయంగా బంగారం ధర ధగధగ మెరుస్తోంది. 2023 జనవరి ఒకటో తేదీన తులం బంగారం ధర (24 క్యారెట్స్) రూ.55,370 పలికితే, సోమవారం రూ.64,470 వద్దకు చేరుకుంది. అంటే ఏడాది కాలంలో తులం బంగారం ధర రూ.9000 పై చిలుకు పెరిగింది.
పెరిగిన ధరల కట్టడికి 2022 మే నుంచి కీలక వడ్డీరేట్లు పెంచుతూ వచ్చిన యూఎస్ ఫెడ్ రిజర్వ్.. వచ్చే మార్చి నుంచి తగ్గిస్తామని వెల్లడించింది. ఫలితంగా డాలర్ ఇండెక్స్, అమెరికా ట్రెజరీ బాండ్ల ధరలు పడిపోయాయి. దేశీయంగా రాజకీయ సుస్థిరత నెలకొంటుండంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.63,970 పలికితే, హైదరాబాద్ లో రూ.63,870 వద్ద నిలిచింది. గతేడాది జనవరి ఒకటో తేదీన హైదరాబాద్ లో బంగారం తులం రూ.55,200 పలికింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది బంగారం తులం ధర రూ.70 వేల మార్కును చేరుతుందని అంచనా వేస్తున్నారు. కోల్ కతా, ముంబై నగరాల్లో పది గ్రాముల బంగారం ధర రూ.63,870 వద్ద తచ్చాడుతున్నది.