Gold Futures | పసిడి ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల పెరుగుతూ వస్తున్నాయి. ట్రంప్ టారిఫ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీన నేపథ్యంలో ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. తాజాగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు, విదేశీ మార్కెట్లలో బలహీనంగా ఉండడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం రికార్డు స్థాయి నుంచి దిగివచ్చాయి. తులం ధర రూ.1.09లక్షల దిగువకు చేరాయి. అమెరికాలో అంచనా వేసిన దానికంటే తక్కువ ఎంప్లాయిస్‌మెంట్ డేటా ప్రపంచంలోని యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలను రేకెత్తిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ వారం చివరలో విడుదలకానున్న ద్రవ్యోల్బణ డేటాను పెట్టుబడిదారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఈ గణాంకాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు వైఖరిపై సూచనలు ఇస్తాయని భావిస్తున్నారు. అక్టోబర్ డెలివరీకి బంగారం ఫ్యూచర్స్ ధర రూ.230 తగ్గింది. పది గ్రాములకు రూ. 1,08,830కి చేరుకుంది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.249 తగ్గి రూ.1,09,839కి తగ్గింది. కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవలి వరుస ర్యాలీల తర్వాత బంగారం ధరలు జీవనకాల గరిష్టానికి చేరాయి. విదేశీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ మధ్య లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గుచూపగా.. ఇది బంగారం ధరలపై ఒత్తిడి తెస్తున్నది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి ఉంటుందని భావిస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్ట్‌లో భారత్, యూఎస్ రెండుదేశాలు స్నేహితులని.. సహజ భాగస్వాములుగా పేర్కొన్నారు. మరో వైపు కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 3,679.02 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 40 శాతం పెరిగాయి. 2024లో 27 శాతం పెరుగుదలను నమోదు చేసిన తర్వాత ఔన్సుకు 3,700 మార్కును దాటయని ఆగ్మాంట్ పరిశోధన విభాగాధిపతి రెనిషా చైనాని తెలిపారు. సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానాలు, యూఎస్ డాలర్ బలహీనపడడం, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచాయన్నారు. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానం సమీప భవిష్యత్‌లో బంగారం ధరల సెంటిమెంట్‌పై బలమైన సంకేతాలను ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.