న్యూఢిల్లీ, నవంబర్ 13: పెట్టుబడులు ఆకట్టుకోవడంలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్ఎస్) దూసుకుపోతున్నాయి. గత నెలలోనూ ఏకంగా రూ.1,961 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం ధరలు భారీగా పుంజుకోవడం, అలాగే పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వరుస నెలలతో పోలిస్తే 59 శాతం పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.841 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. దీంతో గోల్డ్ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులు 12 శాతం పెరిగి రూ.39,823 కోట్ల నుంచి రూ.44,545 కోట్లకు చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను ఈ ఏడాది ఇప్పటి వరకు 75 బేసిస్ పాయింట్లు తగ్గించడం, డాలర్ మరింత బలోపేతం కావడం వంటి పరిణామాలతో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసర్చ్ ఇండియా మేనేజర్ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు.
77 వేల దిగువకు బంగారం
బంగారం ధరలు మరింత దిగాయి. హైదరాబాద్ 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.440 తగ్గి రూ.76,850కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.400 తగ్గి రూ.70,450కి దిగొచ్చింది. కిలో వెండి మాత్రం రూ.1,000 పెరిగి రూ.1.01 లక్షలు పలికింది. అటు ఢిల్లీలో బంగారం నాలుగు వారాల కనిష్ఠ స్థాయి రూ.77,750కి పడిపోయింది.