Gold Rates | గతవారం ధగధగ మెరిసిన బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1300 తగ్గి రూ.81,000లకు పడిపోయింది. స్టాకిస్టులు, రిటైల్ వ్యాపారుల నుంచి భారీ అమ్మకాలు జరగడం వల్లే బంగారం ధరలు తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.82,400 పలికితే, శుక్రవారం బెంగళూరులో రూ.83,050లతో జీవిత కాల గరిష్ట రికార్డు నెలకొల్పింది. అలాగే కిలో వెండి ధర రూ.4,600 క్షీణించి 94,900 వద్ద స్థిర పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ బంగారం కాంట్రాక్ట్స్ తులం ధర రూ.329 పడిపోయి 78,538లకు చేరుకున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.412 పతనమై రూ.95,071 వద్ద స్థిర పడింది.
మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడడంతోపాటు మరో దఫా వడ్డీరేట్ల తగ్గింపు విషయమై యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్స్‌లో మిశ్రమ ధోరణి నెలకొంది. ఎంసీఎక్స్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.78,000-79,000 మధ్య స్థిర పడుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదొడుకులకు గురి అవుతున్నాయి. కామెక్స్ గోల్డ్‌లో ఔన్స్ బంగారానికి 2730 డాలర్లతో ముగిసింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 3.6 డాలర్లు పుంజుకుని 2752.80 డాలర్ల వద్ద స్థిర పడింది. మరోవైపు కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 32.94 డాలర్లకు చేరుకున్నది.