Gold Discounts | బంగారం అంటే భారతీయ వనితలకు ఎంతో ఇష్టం.. కానీ డిమాండ్ పడిపోయింది. అందునా ఇప్పుడు పెండ్లిండ్ల సీజన్ ముగింపు దశకొస్తున్నది. ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయి. దీంతో బులియన్ వ్యాపారులు మహిళలను ఆకర్షించడానికి బంగారం కొనుగోలుపై డిస్కౌంట్లు పెంచేశారు. ఈ వారంలో ఔన్స్ బంగారం విక్రయంపై 9 డాలర్ల ధర తగ్గించారని సమాచారం. బంగారం దిగుమతిపై 10.75 శాతం సుంకం, మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వాల లెవీ వసూలవుతుంది. ఈ పరిస్థితుల్లో గత వారం ఐదు శాతం డిస్కౌంట్లు ఇచ్చిన జ్యువెల్లరీ వ్యాపారులు ఈ వారం తొమ్మిది శాతానికి పెంచేశారు.
దేశీయ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు నెలలోనే గరిష్ఠ స్థాయికి చేరాయి. అధిక ధరల వల్ల కొన్ని రోజులుగా రిటైల్ కస్టమర్ల డిమాండ్ పడిపోతున్నదని ముంబై కేంద్రంగా పని చేస్తున్న చెనాజీ నర్సింగ్జీ బంగారం వ్యాపార సంస్థ అధినేత అశోక్ జైన్ తెలిపారు. వివాహాల సీజన్ ముగింపు దశకు రావడంతోపాటు జూన్లో గిరాకీ కూడా తక్కువేనన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. వివిధ పంటలకు విత్తనాలు నాటుతారు. దీంతో గ్రామీణుల నుంచి మున్ముందు బంగారానికి డిమాండ్ తగ్గిపోతుందని ముంబై కేంద్రంగా పని చేస్తున్న బులియన్ డీలర్ తెలిపారు. చైనాలో కూడా ఔన్స్ బంగారంపై 0.5-1.5 డాలర్ల మేరకు డిస్కౌంట్ అందిస్తున్నది.