ముంబై, మే 23: పసిడికి డిమాండ్ క్రమంగా పడిపోతున్నది. ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్యుడు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ డిమాండ్ పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోనున్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. ప్రస్తుతం గోల్డ్ ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలు కొత్త ఆభరణాలు కొనడం కష్టంగా మారుతున్నదని విశ్లేషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం అమ్మకాల పరిమాణం ఎనిమిది శాతం తగ్గిందని, ఈ ఏడాది 13-15 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నదని తెలిపింది. దీంతో ఈ ఏడాది 620-640 టన్నులకు పరిమితంకానున్నదని అంచనా. దీనికి ప్రధాన కారణం ధరల పెరుగుదల, దిగుమతి సుంకం పెంపు అని పేర్కొన్నది. దేశంలో వినియోగించే బంగారం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. దీంతో ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల గోల్డ్ దిగుమతులపై సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం గోల్డ్ ధర రూ.1.60 లక్షల స్థాయిలో కొనసాగుతున్నది.