Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో సెంటిమెంట్ బలహీనపడడం, అమెరికా సుంకాల హెచ్చరికల నేపథ్యంలో పుత్తడి ధరలు పడిపోయాయి. సోమవారం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గి తులం రూ.98,570కి తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ.500 తగ్గి తులం రూ.98,100కి చేరుకుంది. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. కిలోకు రూ.1,04,800 పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. బంగారం ధరల తగ్గుదలకు ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన ధోరణి ఉందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే కాకుండా భౌతిక మార్కెట్లో కాలానుగుణ డిమాండ్ తగ్గడం ధరలకు పతనానికి దారి తీసిందని తెలిపాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్స్‌కు 38.95 డాలర్లు తగ్గి 3,297.69 డాలర్లకు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. డాలర్లో మెరుగుదల, అమెరికా ఉపాధి మార్కెట్ అంచనా కంటే బలంగా ఉండటం వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లాయన్నారు. దాంతో బంగారం బలహీనపడిందని చెప్పారు. దాంతో పాటు అమెరికా సుంకాలపై ఆందోళనలు తగ్గడం కారణంగా డిమాండ్ పడిపోయిందని చెప్పారు. పలు దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు దగ్గరలో ఉన్నామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెన్సెంట్ వారాంతంలో తెలిపారు. ఆగస్టు ఒకటి నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నాయి. ఇక కాల్పుల విరమణ ప్రకటన తర్వాత బంగారం ధర కొద్దిగా తగ్గిందని పీఎల్ క్యాపిటల్ రిటైల్ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సీఈవో, డైరెక్టర్ సందీప్ రైచురా పేర్కొన్నారు.
కేంద్ర బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోలు సంవత్సరానికి వెయ్యి టన్నులకుపైగా జరుగుతోంది. రాబోయే కొన్ని నెలల్లో బంగారం ధర ఎక్కువగా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, వ్యాపారులు బంగారంపై ఆశాజనకంగానే ఉన్నారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ బుధవారం జరగనున్న యూఎస్ ఫెడ్ సమావేశం వివరాలు సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధాన వైఖరి, సమీప భవిష్యత్తులో బులియన్ ధరల దిశ గురించి లోతైన వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల పసిడి రూ.98,290 ఉన్నది. 22 క్యారెట్ల బంగారం రూ.90,100 పలుకుతున్నది. వెండి కిలోకు రూ.1.20లక్షలు పలుకుతున్నది.