Gold-Silver Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి తులం ధర రూ.99,020కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.250 పెరగడంతో రూ.98,550కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర కిలోగ్రాముకు రూ.500 పెరిగి రూ.1.11లక్షలు పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని బులియన్ వ్యాపారులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ఔన్సుకు 15.16 డాలర్లకు పెరిగి 3,365.56 డాలర్లకు చేరుకుంది.
విదేశీ మార్కెట్లలో స్పాట్ వెండి ఔన్సుకు 0.73 శాతం పెరిగి 38.47 డాలర్లకు చేరుకుంది. అమెరికా టారిఫ్ పాలసీ, యూఎస్ డాలర్ పతనానికి సంబంధించి అనిశ్చితి మధ్య సోమవారం బంగారం ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. పెట్టుబడిదారులు అమెరికా వాణిజ్య ఎజెండాతో పాటు కీలకమైన అమెరికా స్థూల ఆర్థిక డేటాను నిశితంగా గమనిస్తారని గాంధీ అన్నారు. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు, బులియన్ ధరల దిశపై మరిన్ని సూచనల కోసం పెట్టుబడిదారులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తారని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది అన్నారు.