న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న ధరలు మరో మెట్టు పైకి ఎక్కింది. సోమవారం ఏకంగా పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,685 ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,38,200కి చేరుకున్నది. పసిడి చరిత్రలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు పరుగులు పెట్టడం వల్లనే దేశీయంగా రికార్డు స్థాయికి ఎగబాకాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,970 ఎగబాకి రూ.1,36,100కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ.1,800 అందుకొని రూ.1,24,800 గా నమోదైంది.
పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. సోమవారం కిలో వెండి ఏకంగా రూ.10,400 ఎగబాకి ఆల్‌టైం హైకి రూ.2,14,500 చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 80.56 డాలర్లు లేదా 1.86 శాతం ఎగబాకి రికార్డు స్థాయి 4,420.35 డాలర్లు పలికింది. అలాగే వెండి 2.31 డాలర్లు అధికమై 69.45 డాలర్లకు చేరుకున్నది.