న్యూఢిల్లీ, జనవరి 14 : బంగారం, వెండి ధరలు మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న అతి విలువైన లోహాల ధరలకు పండగ జోష్ మరింత ఊపునిచ్చింది. దీంతో ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న ధరలు బుధవారం ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. వెండి ఏకంగా రూ.15 వేలు పెరిగి రూ.2.86 లక్షలకు చేరుకున్నది. వరుసగా నలుగు రోజుల్లో వెండి ఏకంగా రూ.42,500 లేదా 17.45 శాతం ఎగబాకింది. జనవరి 8న రూ.2,43,500 వద్ద ఉన్న వెండి..ప్రస్తుతం రూ.2.86 లక్షలకు చేరుకున్నది. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటి వరకు 20 శాతం లేదా రూ.47 వేలు అధికమైంది. డిసెంబర్ 31, 2025న రూ.2.39 లక్షల వద్ద ఉన్నది.
వెండితోపాటు బంగారం కూడా చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.1,500 ఎగబాకి రూ.1,46,500 పలికింది. ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. మంగళవారం రూ.1.45 లక్షల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజుల్లో గోల్డ్ ధర రూ.6 వేలు లేదా 4.3 శాతం బలపడినట్టు అయింది. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు గోల్డ్ ధర రూ.8,800 లేదా 6.4 శాతం అధికమైంది. గతేడాది చివరిన రూ.1,37,700గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగడం వల్లనే దేశీయంగా పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఔన్స్ వెండి 91 డాలర్లు అధిగమించి 91.56 డాలర్లకు చేరుకున్నది. అలాగే బంగారం 4,640.13 డాలర్లుగా నమోదైంది.