న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : బులియన్ మార్కెట్లో పశ్చిమాసియా గుబులు కనిపించింది. గురువారం ట్రేడింగ్‌లో వెండి ధర భారీగా తగ్గింది. బంగారం రేటూ దిగజారింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.1,500 లేదా దాదాపు 1 శాతం దిగి రూ.1,54,900 (అన్ని పన్నులు సహా)గా నమోదైంది. అలాగే కిలో వెండి రూ.7,800 లేదా 3.10 శాతం పడిపోయి రూ.2,43, 200 వద్ద స్థిరపడింది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది. కాగా, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు.. మదుపర్లను లాభాల స్వీకరణ దిశగా నడిపించాయని ట్రేడింగ్ సరళిని ట్రేడింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
హైదరాబాద్‌లోనూ ధరలు దిగొచ్చాయి. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం పసిడి ధర రూ.2,150 పడిపోయి రూ.1,38,850 వద్ద స్థిరపడింది. బుధవారం రూ.3,650 పుంజుకోవడం విశేషం. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒడంబడిక కుదరడంతో.. ఇక మిడిల్ ఈస్ట్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న అంచనాలు అంతటా వినిపించాయి. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో.. పరిస్థితి మొదటికొచ్చిందా? అన్న అనుమానాలు వస్తున్నాయి.