ముంబై, జూలై 31 : దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ అంతకంతకు పడిపోతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరల కారణంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్యుడి నుంచి సంపన్న వర్గాల వరకు వెనుకంజవేస్తున్నారు. దీంతో దేశీయంగా డిమాండ్ భారీగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక కూడా ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో 134.9 టన్నుల గోల్డ్ అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 149.7 టన్నులతో పోలిస్తే 10 శాతం తగ్గిందని పేర్కొంది. విలువ పరంగా చూస్తే 30 శాతం ఎగబాకి రూ.1,21,800 కోట్లకు చేరుకున్నది. 2024లో ఇదే త్రైమాసికంలో విలువ రూ.93,850గా ఉన్నది. పదిగ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.1,00,000ని అధిగమించింది ఈ త్రైమాసికంలోనని ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ2 2025’ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలో భారత్‌లో గోల్డ్ డిమాండ్ 600 టన్నుల నుంచి 700 టన్నుల స్థాయిలో ఉంటుందని అంచనావేస్తున్నది.
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.500 తగ్గి రూ.98,020కి దిగొచ్చింది. భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో బుధవారం భారీగా నష్టపోయిన రూపాయి మారకం విలువ గురువారం కోలుకోవడంతో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయని విశ్లేషకులు వెల్లడించారు. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి విలువ రూ.400 దిగొచ్చి రూ.97,800కి పరిమితమైంది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి రూ.2,000 తగ్గి రూ.1,12,000కి చేరుకున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉండటంతో డాలర్ విలువ మరింత బలోపేతమైందని, దీంతో బంగారం ధరలు తిరోగమన బాటపట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. కానీ, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 29.10 డాలర్లు ఎగబాకి 3,304.14 డాలర్లకు చేరుకోగా, వెండి 2.22 శాతం తగ్గి36.30 డాలర్లకు పరిమితమైంది.