న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 : బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు ఎగువముఖం పడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.3,500 లేదా 2.3 శాతం అందుకొని రూ.1.55 లక్షలకు చేరుకున్నది. అలాగే కిలో వెండి రూ.9 వేలు లేదా 3.8 శాతం అందుకొని రూ.2.46 లక్షలకు చేరుకున్నది. సోమవారం ఈ ధర రూ.2.37 లక్షలుగా ఉన్నది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, బ్యారెల్ చమురు ధర 100 డాలర్ల దిగువకు పడిపోవడం కూడా పెట్టుబడిదారులు అతి విలువైన లోహాల వైపు దృష్టిసారించారని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం తులం ధర రూ.57,350 లేదా 61 శాతం ఎగబాకింది. ఏప్రిల్ 1, 2025లో ధర రూ.94,150గా ఉన్నది. అలాగే వెండి రూ.1,34,500 ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 76.51 డాలర్లు లేదా 2 శాతం ఎగబాకి 4,743.89 డాలర్లకు చేరుకోగా, వెండి 75.04 డాలర్లుగా ఉన్నది.