న్యూఢిల్లీ, మే 28: జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.400.49 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికిగాను సంస్థ రూ.252.66 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,976 కోట్ల నుంచి రూ.4,042 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థ హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది.
మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.15,200 కోట్ల ఆదాయంపై రూ.472 కోట్ల నికర లాభాన్ని గడించింది. మార్చి త్రైమాసికంలో 3.17 కోట్ల మంది విమాన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చిన సంస్థ..గతేడాది మొత్తానికి 12.16 కోట్ల మంది రెండు విమానాశ్రయాల గుండా ప్రయాణించారు. వీరిలో ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ గుండా 7.87 కోట్ల మంది ప్రయాణించినట్టు వెల్లడించింది.