ముంబై, జనవరి 2: దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర ఈ ఏడాది దాదాపు రూ.70,000 దరిదాపుల్లోకి వెళ్లవచ్చని అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) మంగళవారం అంచనా వేసింది. గత ఏడాది మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం రేటు సరికొత్త ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టిస్తూ రూ.64,460గా నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది మరో రూ.5,000 నుంచి 6,000 వరకు పెరుగవచ్చన్న అభిప్రాయాన్ని జీజేసీ వ్యక్తం చేసింది.
ఇదీ సంగతి..
బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాల వెనుక అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆందోళనలు ప్రధానంగా ఉన్నాయని జీజేసీ అంటున్నది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులకు సురక్షిత సాధనంగా పసిడినే ఎంచుకుంటుండటం, ద్రవ్యోల్బణం సవాళ్లను అధిగమించేందుకున్న అత్యుత్తమ మార్గం సైతం పుత్తడేనని మెజారిటీ ఇన్వెస్టర్లు భావిస్తుండటం కూడా రేట్లు ఎగబాకేందుకు దోహదం చేస్తున్నదని చెప్తున్నది.
గ్లోబల్ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ విలువ ఈ ఏడాది 2,300 డాలర్లకు చేరవచ్చని జీజేసీ అంచనా వేస్తున్నది. ఇదే జరిగితే భారతీయ మార్కెట్లో 10 గ్రాములు గరిష్ఠంగా రూ.70,000 తాకుతుందని అంటున్నది. 2023లో గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 2,081 డాలర్లు పలికింది. ‘ఆర్థిక పరిస్థితులు ఇంకా దిగజారితే బంగారం తదితర రక్షణాత్మక ఆస్తులకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో వాటి విలువ అమాంతం ఎగిసిపడవచ్చు. ఫలితంగా అన్ని పాత అంచనాల్ని మించి మార్కెట్ దూసుకుపోగలదు’ అని జీజేసీ చైర్మన్ సైయం మెహ్రా ఓ ప్రకటనలో విశ్లేషించారు. ఈ క్రమంలోనే భౌతిక బంగారంతోపాటు గోల్డ్ బాండ్లు, కడ్డీలు, నాణేలకూ గిరాకీ ఉంటుందంటున్నారు.
2023లో..
2023లో బంగారం ధరలు ఆకర్షణీయంగానే పెరిగాయి. తులం రూ.8,000 వరకు ఎగబాకడం గమనార్హం. 2022 ఆఖర్లో 10 గ్రాముల పుత్తడి రూ.57,000 దరిదాపుల్లోనే ఉన్నది. 2023 చివర్లో ఇది సుమారు రూ.65,000 వద్దకు చేరింది. దీంతో రూ.8,000 వృద్ధి కనిపించగా, బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులకు ఏకంగా 13 శాతం లాభాలు దక్కాయి. ఈ ఏడాదీ మార్కెట్ తీరు ఇలాగే ఉంటుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఇప్పటికే కొత్త సంవత్సరం వేళ టిప్స్ ఇస్తున్న ఆర్థిక నిపుణులు.. బంగారంపై పెట్టుబడుల కోసం మదుపరులు తమ పోర్ట్‌ఫోలియోల్లో 10-15 శాతం వరకు కేటాయించుకోవచ్చని సూచిస్తున్న విషయం తెలిసిందే.
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇస్తుందన్న అంచనాలు, అధిక ద్రవ్యోల్బణం వంటివి మదుపరులను బంగారం వైపు చూసేలా చేస్తున్నాయి. గత ఏడాది ఏవిధంగానైతే ఇన్వెస్టర్లను పసిడి ఆకట్టుకున్నదో.. ఈ ఏడాదీ అదే రీతిలో ఆకర్షించే వీలున్నది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా దాడుల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ల ఒడిదుడుకుల మధ్య సహజంగానే మదుపరులు బంగారం వైపునకు వెళ్తారు. దీనివల్ల బహిరంగ మార్కెట్లో ధరలు మరింత పెరుగుతాయి.
-సైయం మెహ్రా, జీజేసీ చైర్మన్