పెద్ద చదువులు.. అందులోనూ టాప్ కాలేజీల్లో, విదేశీ యూనివర్సిటీల్లో విద్యంటే మన చేతిలో ఉన్న సొమ్ము సరిపోదు. పిల్లల ఉన్నత చదువు కోసం తల్లిదండ్రులు పొదుపు చేసిన సొమ్ము ఇప్పుడున్న ఫీజులకు ఏమాత్రం చాలదంటే అతిశయోక్తి కాదు. అందుకే చాలామంది విద్యా రుణాలను తీసుకోక తప్పని పరిస్థితి. అయితే పద్ధతిగా ఉపయోగిస్తే విద్యా రుణాన్ని ఓ మంచి అప్పుగానే భావించవచ్చు.
ఇటీవలికాలంలో విద్యా రుణాలకు డిమాండ్ పెరిగింది. ప్రాధాన్యతా రంగాల రుణం కింద ప్రభుత్వం ప్రకటించినందున వడ్డీరేట్లు కూడా మిగతా రుణాలతో పోల్చితే చాలా తక్కువ. బ్యాంకులూ వీటిని తక్కువ వడ్డీ రుణాలంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. విద్యా రుణాలను విద్యార్థి పేరు మీదే ఇస్తారు. వారిని ప్రైమరీ అప్లికెంట్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. విద్యా రుణాల దరఖాస్తు మీద తల్లిదండ్రులు, సంరక్షకుడు లేదా తోబుట్టువులెవరైనా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ రుణాల్లో యూనివర్సిటీ ఫీజు, పుస్తకాలు-ట్యూషన్ ఖర్చులు, పరీక్ష రుసుములు, ఇంకా కోర్సును పూర్తి చేయడానికయ్యే వ్యయాలన్నింటికీ నగదును పొందవచ్చు. ఈ రుణాలకు సంబంధించిన వివరాలివిగో..