Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. తమ పరిధిలోని ఆర్టీవో (రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ – RTO) కు వెళ్లాలి. అక్కడ నిర్దిష్ట గైడ్‌లైన్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తే తొలుత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్..అటుపై శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తారు. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసుకెళ్లడానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్డీవో ఆఫీసు వద్ద తప్పనిసరి టెస్ట్‌కు హాజరు కానవసరం లేకుండా గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లలో ( accredited driver training centres ) డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు.
డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి అక్రిడిటేడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయని కేంద్ర జాతీయ రహదారుల, రవాణాశాఖ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను కేంద్ర, రాష్ట్ర రవాణా శాఖలు నిర్వహిస్తుంటాయి.
అలా అక్రిడిటేడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే.. ఆయా సంస్థల వద్ద డ్రైవింగ్ శిక్షణ కోసం పేరు నమోదు చేసుకోవాలి. ట్రైనింగ్.. దానికి సంబంధించిన పరీక్ష పాసైన తర్వాత సంబంధిత అభ్యర్థులకు ఆయా ట్రైనింగ్ సెంటర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తాయి.
అటుపై శిక్షణ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆర్టీవో వద్ద ఎటువంటి టెస్ట్ లేకుండానే ట్రైనింగ్ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు.
అయితే, సదరు ట్రైనింగ్ కేంద్రాలు.. స్టిమ్యులేటర్లు, డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్‌లను కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్ఎంవీస్), మీడియం, హెవీ వెహికల్స్ (హెచ్ఎంవీస్) డ్రైవింగ్‌లో సదరు అక్రిడేటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు శిక్షణ ఇస్తాయి.
లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ శిక్షణ 29 గంటల పాటు ఉంటుంది. కోర్స్ ప్రారంభించిన నాలుగు వారాల్లో శిక్షణ పూర్తి కావాలి. ట్రైనింగ్ సెంటర్లు తమ వద్దకు వచ్చిన అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలి. ఈ సెంటర్లు ఇండస్ట్రీ-స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ శిక్షణ కూడా అందిస్తాయి. గతేడాదే కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ నోటిపికేషన్ జారీ చేసింది.
ఇలా అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రైవేటీకరించడమేనని చెబుతున్నాయి. ఈ సెంటర్లు సంబంధిత వ్యక్తులకు సరైన వెరిఫేషన్లు, తనిఖీలు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయని ఆయా రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి.