హైదరాబాద్, ఫిబ్రవరి 8: బాష్.. ఉత్పత్తిని కాదు, ఈ బ్రాండ్‌ను ఇష్టపడి కొంటారంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో బాష్ వస్తూత్పత్తుల నాణ్యతకు అంతటి మంచి పేరున్నది. ఇంజినీరింగ్, టెక్నాలజీల్లో తిరుగులేని సంస్థగా బాష్ వెలుగొందుతున్నది మరి. ఏరోప్లేన్ దగ్గర్నుంచి వంటింట్లో మిక్సర్ గ్రైండర్ వరకు బాష్ తయారు చేస్తున్నది. జర్మనీ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు హైదరాబాద్‌కొచ్చింది. భాగ్యనగరంలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఈ ఫెసిలిటీని తెస్తుండగా, పరిశోధన, అభివృద్ధిపైనా ఇది దృష్టిపెట్టనున్నది. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న బాష్.. ఇకపై హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ కార్యకలాపాలను సాగించేందుకు సిద్ధమవడం విశేషం.