న్యూఢిల్లీ, మే 27: మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 4 శాతానికి క్షీణిస్తుందని రాయిటర్స్ పోల్లో పాల్గొన్న ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. మే 23-26 తేదీల మధ్య నిర్వహించిన ఈ పోల్లో 46 మంది ఎకానమిస్టులు పాల్గొన్నారు. 2021 మార్చి క్వార్టర్లో 5.4 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు తిరిగి జనవరి-మార్చి త్రైమాసికంలో ఒమిక్రాన్ వేవ్ దెబ్బ తగిలిందని బార్క్లేస్ చీఫ్ ఎకానమిస్ట్ రాహుల్ బజోరియా పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో జీడీపీ 20.3 శాతం, 8.5 శాతం, 5.4 శాతం చొప్పున వృద్ధిచెందింది. నాలుగో త్రైమాసికానికి జీడీపీ డాటా మే 31న కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేయనున్నది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతం ఉండవచ్చని గత నెలలో రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో అంచనాలు వ్యక్తమయ్యాయి.