Adani-Total | న్యూఢిల్లీ, నవంబర్ 25: గౌతమ్ అదానీకి ఫ్రాన్స్ ఇంధన రంగ దిగ్గజ సంస్థ టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ షాకిచ్చింది. అదానీ గ్రూప్ సంస్థల్లో ఇకపై కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని సోమవారం ప్రకటించింది. అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైన నేపథ్యంలోనే టోటల్ ఈ నిర్ణయం తీసుకున్నది. అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి తమకు ఏమీ తెలియదంటున్న టోటల్ఎనర్జీస్.. ఆ కేసు పరిష్కారం అయ్యేంతదాకా తదుపరి పెట్టుబడుల జోలికి వెళ్లబోమని తేల్చి చెప్పేసింది.
బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న ప్రధాన విదేశీ సంస్థాగత మదుపరులలో టోటల్ఎనర్జీస్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), సిటీ గ్యాస్ యూనిటైన అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్)లలో వాటాలు కూడా ఉన్నాయి. ‘అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కోసం సోలార్ పవర్ సరఫరా కాంట్రాక్టులను పొందేందుకు భారతీయ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలను గౌతమ్ అదానీ, మరో ఇద్దరు సంస్థ ఉన్నతోద్యోగులు ఇచ్చారని అమెరికా అధికార వర్గాలు నేరారోపణలు చేసిన విషయం తెలిసింది. ఏజీఈఎల్ లేదా దాని అనుబంధ సంస్థలే లక్ష్యంగా ఈ నేరారోపణలు రాకున్నా.. కీలక వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నందున, ఈ వ్యవహారం తేలేదాకా మరిన్ని పెట్టుబడులు అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం.’ అని టోటల్ఎనర్జీస్ స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్, టోటల్ఎనర్జీస్ మధ్య అనుబంధం ఆరేండ్లుగా కొనసాగుతున్నది. ఏజీఈఎల్‌లో టోటల్‌కు 19.75 శాతం వాటా ఉన్నది. అలాగే ఏటీజీఎల్లో 37.4 శాతం వాటాను కొన్నది. అయితే 2018లో ఓ ఎల్ఎన్జీ వెంచర్ కోసం అదానీతో తొలిసారిగా టోటల్ఎనర్జీస్ జట్టు కట్టింది. ఆ తర్వాతే ఏజీఈఎల్, ఏటీజీఎల్లో వాటాలను సొంతం చేసుకున్నది. ముడిచమురు-సహజవాయువుల అన్వేషణ, ఉత్పత్తి, అమ్మకపు రంగాల్లో టోటల్ఎనర్జీస్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల్ని సాగిస్తున్నది. అలాంటి ఈ కంపెనీ నుంచి మరిన్ని పెట్టుబడులకు బ్రేక్ పడటం అదానీ గ్రూప్‌నకు ఇబ్బందేనన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.