Adani Top10 Billioneers | ఆసియాలో కెల్లా అతిపెద్ద కుబేరుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ నిలిచారు. ఆయన నికర ఆస్తి 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. నిన్న మొన్నటి వరకు టాప్-10 ర్యాంక్‌లో ఉన్న ముకేశ్ అంబానీని గౌతం అదానీ దాటేశారు. ముకేశ్ అంబానీ వ్యక్తిగత ఆస్తి 99 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో గ్లోబల్ బిలియనీర్స్ జాబితాలో ముకేశ్ అంబానీ 11వ స్థానానికి పడిపోయారు.
59 ఏండ్ల గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్.. నౌకాశ్రయాలు.. విమానాశ్రయాల నుంచి థర్మల్ విద్యుత్, బొగ్గు తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తద్వారా గౌతంఅదానీ వ్యక్తిగత ఆస్తి 100 బిలియన్ డాలర్ల మార్క్‌కు చేరుకున్నది. కొన్ని నెలలుగా టాప్-10 బిలియనీర్స్ జాబితాలో చోటు కోసం ముకేశ్ అంబానీ, గౌతం అదానీ పోటీపడుతున్నారు.
ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్ద కుబేరుల్లో ఒకరిగా ఉన్న ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధీనంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ముడి చమురు రిఫైనరీ ప్లాంట్ పని చేస్తున్నది. దేశవ్యాప్తంగా 4జీ వైర్లెస్ నెట్‌వర్క్‌తో కూడిన జియో టెలికం సేవలందిస్తున్నది. ఇంకా రిటైల్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో దూసుకెళ్తున్నది.
2022 ఎం3ఎం హురున్ గ్లోబల్ లిస్ట్ ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద 2021లో 49 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది టాప్ త్రీ గ్లోబల్ బిలియనీర్లు ఎలన్‌మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్ల కంటే అధికం. అదానీ గ్రూప్ వంట నూనెల కంపెనీ అదానీ విల్మార్ గత వారం ట్రేడింగ్‌లో 30 శాతం లాభ పడింది. అదానీ విల్మార్ స్క్రిప్ట్ రూ.230 నుంచి 136 శాతం పెరిగింది. ఐపీవో ద్వారా అదానీ విల్మార్క్ రూ.3,600 కోట్ల నిధులు సమీకరించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి అదానీ విల్మార్ షేర్ పైపైకి దూసుకెళ్తూనే ఉంది.