న్యూఢిల్లీ, జనవరి 26: దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ తాజాగా విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందుకోసం బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయిర్తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ జట్టుకట్టబోతున్నది. ఇరు సంస్థల మధ్య బుధవారం అంగీకార ఒప్పందం జరుగనున్నట్టు తెలుస్తున్నది. దేశీయ విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి గతేడాది న్యూఢిల్లీలో కార్యాలయాన్ని తెరిచిన ఎంబ్రాయిడర్..ఈసారి ఏకంగా ఇక్కడే విమానాలను తయారు చేయడానికి సిద్ధమైంది.
ఇందుకోసం అనువైన కార్పొరేట్ సంస్థ కోసం వెంపర్లాడిన కంపెనీకి అదానీ అనువైనదని గుర్తించి ఒప్పందం చేసుకోవడానికి రెడీ అయింది. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా బుధవారం ఇందుకు సంబంధించి ఎంవోయూ జరగనున్నది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఎంబ్రాయిడర్లో 150 మంది వరకు ప్రయాణికులు కూర్చోవడానికి వీలుండే విధంగా విమానాలను తయారు చేస్తున్నది. ఆ తర్వాత అదానీ గ్రూపు విమానాల విడిభాగాలను తయారు చేసేయోచనలో కూడా ఉన్నది.
భారత్‌లో విమానాలకు భారీ డిమాండ్ నెలకొన్నది. ప్రయాణికులు రోజు రోజుకూ భారీగా పెరుగుతుండటంతో ఇక్కడి మార్కెట్‌పై విమాన తయారీ సంస్థలు దృష్టి సారించాయి. ఎయిర్‌బస్, బోయింగ్, ఎంబ్రాయిడర్, బొంబార్డియర్, దస్సాల్ట్ వంటి సంస్థలు ఇక్కడి మార్కెట్లో పాగవేయడానికి పావులు కదుపుతున్నాయి. వచ్చే 20 ఏండ్లకాలంలో భారత్‌లో 80 నుంచి 146 సీట్ల సామర్థ్యం కలిగిన 500 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరమవుతాయని ఎంబ్రాయిర్ వెల్లడించింది.