న్యూఢిల్లీ, జనవరి 18: దేశీ శ్రీమంతుల్లో అగ్రస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ భారీ పబ్లిక్ ఆఫర్‌కు సిద్ధమవుతున్నది. అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) రూ.20,000 కోట్ల సమీకరణకు జారీచేయనున్న ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)జనవరి 27న ప్రారంభమవుతుంది. ఇష్యూ జనవరి 31న ముగుస్తుంది. సేకరణకు ప్రతిపాదించిన రూ. 20 వేల కోట్ల నిధుల్లో రూ. 10,869 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత ఎయిర్‌పోర్టుల విస్తరణలు, కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్ వే కోసం ఖర్చుచేయనున్నట్టు ఏఈఎల్ ఆఫర్ లెటర్లో వెల్లడించింది. మరో రూ.4,165 కోట్లు ఎయిర్‌పోర్టులు, రహదారులు, సోలార్ ప్రాజెక్టు సబ్సిడరీలు తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఏఈఎల్ వినియోగించనుంది. ఏఈఎల్‌లో ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉండగా, ఎఫ్పీవోతో ఈ వాటా 3.5 శాతం మేర తగ్గుతుంది. ఆఫర్ వివరాలు..
అదానీ గ్రూప్ కొత్తగా విస్తరిస్తున్న వ్యాపారాల్ని చాలావరకూ ఏఈఎల్ చేపడుతున్నది. ప్రస్తుతం ఇది గ్రీన్ హైడ్రోజన్, డాటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు అభివృద్ధి, డిజిటల్, ఎఫ్ఎంసీజీ, మైనింగ్, రక్షణ, పారిశ్రామికోత్పత్తుల తయారీ తదితర రంగాల్లో నిమగ్నమై ఉంది. 2022 సెప్టెంబర్ 30 నాటికి ఏఈఎల్‌కు రూ. 40,023 కోట్ల మేర రుణాలున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 38,175 కోట్ల ఆదాయంపై రూ. 461 కోట్ల నికరలాభం ఆర్జించింది.