Future Group on Bankrupty | రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు సమర్ధించడంతో ఫ్యూచర్ రిటైల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి గతేడాది ఆగస్టులో రూ.24,713 కోట్ల మేరకు కుదిరిన ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో కిశోర్ బియానీ సారధ్యంలోని ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల రిటైల్ నెట్వర్క్ దివాళా అంచున నిలిచింది.
కరోనా ఆంక్షల నేపథ్యంలో పలు ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఔట్లెట్లు మూతపడ్డాయి. మరోవైపు రూ.6000 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో దేశవ్యాప్తంగా వెండర్లు.. ఫ్యూచర్ గ్రూప్‌కు సరుకుల సరఫరా నిలిపివేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఒకవేళ రిలయన్స్-ఫ్యూచర్ డీల్ మరో మూడు నెలలు జాప్యమైతే.. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు దివాళా దశకు చేరుకుంటాయి. బ్యాంకుల రుణ బకాయిలు, వెండర్ల అప్పులు చెల్లించడానికి ఫ్యూచర్ గ్రూప్ వద్ద సరిపడా నగదు లేదు. ఈ డీల్ లేకపోతే దివాళా పిటిషన్ దాఖలు చేయడమే ఏకైక ప్రత్యామ్నాయం అని ఫ్యూచర్ ఉద్యోగి ఒకరు తెలిపారు.
ఒకవేళ ఫ్యూచర్ గ్రూప్ దివాళా ప్రకటిస్తే బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు బ్యాంకుల నుంచి ఉమ్మడిగా ఇబ్బడిముబ్బడిగా సుమారు రూ.19వేల కోట్ల రుణాలు తీసుకున్నాయి. దీంతోపాటు వెండర్లకు రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) ఒక్కటే రూ.6,278 కోట్ల రుణాలు తీసుకున్నది. ఎఫ్ఆర్ఎల్కు ఎస్బీఐతోపాటు యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ రుణాలిచ్చాయి.
రుణ బకాయిలు చెల్లించడానికి తమ సంస్థకు ఎటువంటి ఆస్తుల్లేవని ఫ్యూచర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. తమ స్టోర్లు అద్దెపైనే నడుస్తున్నాయన్నారు. వెండర్లు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారన్నారు. తమ సంస్థకు వచ్చే ఆదాయంలో ప్రధాన వాటా ఉద్యోగుల వేతనాలు, వెండర్ల చెల్లింపులకే పోతుందన్నారు.
ఇదిలా ఉంటే ఆర్బీఐ గతేడాది ఆగస్టు ఆరో తేదీన జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు.. ఫ్యూచర్ గ్రూప్‌కు ఇచ్చిన రుణాలను వన్‌టైం పునర్వ్యవస్థీకరణ (ఓటీఆర్) చేశాయి. అదీ కూడా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)తో విలీన ఒప్పందం పూర్తి చేసుకోవాలన్న షరతుపైనే ఫ్యూచర్ గ్రూప్‌కు బ్యాంకర్లు ఓటీఆర్ ఫెసిలిటీ కల్పించాయి.
రిలయన్స్‌తో డీల్ ఖరారైన నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్‌కు ఇచ్చిన తమ రుణాలను వసూలు చేసుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని ఓ బ్యాంకర్ చెప్పారు. ఒకవేళ రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీన ఒప్పందం ఫెయిలైతే తాము కల్పించిన ఓటీఆర్ ఫెసిలిటీ కూడా ఆటోమేటిక్‌గా చెల్లకుండా పోతుందని ఆ బ్యాంకర్ వ్యాఖ్యానించారు.
బిగ్ బజార్, ఎఫ్‌బీబీ, ఫుడ్‌హాల్, ఈజీడే, నీల్గిరీస్, సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీలతో కూడిన ఫ్యూచర్ గ్రూప్ కీలక బిజినెస్‌లకు రూ.24,713 కోట్లు చెల్లించేందుకు ఆర్ఆర్వీఎల్ సిద్ధపడింది. వీటితోపాటు ఫ్యూచర్ గ్రూప్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ బిజినెస్ కూడా ఉంది. అలాగే ఫ్యూచర్ గ్రూప్ రుణాలు, అప్పుల చెల్లింపులకు ఆర్ఆర్వీఎల్ అంగీకరించింది.
రిలయన్స్ రిటైల్‌లో విలీన ఒప్పందం అమలుకు ఫ్యూచర్ గ్రూప్ ప్రక్రియ చేపట్టింది. రిటైల్ బిజినెస్‌ను కన్సాలిడేట్ చేసే పనిలో పడింది. గ్రూప్ బిజినెస్‌ను ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ సప్లయ్ చైన్, ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్గా విభజించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెజాన్‌కు మెజర్ రిలీఫ్ లభించింది. ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ కూపన్స్‌లో ఇన్వెస్టర్‌గా, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)లో వాటాదారుగా సుప్రీంకోర్టులో అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది. రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌లో ఎఫ్ఆర్ఎల్ భాగం కూడా. ప్రస్తుత దశలోనూ సమీక్షా పిటిషన్‌తోపాటు అన్ని న్యాయపరమైన ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కానీ పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.
ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందానికి అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పలేదని రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. 1996 నాటి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్‌లోని 17 (1) సెక్షన్ ప్రకారం సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలు చెల్లుబాటవుతాయని మాత్రమే చెప్పిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదానికి అమెజాన్‌తోపాటు రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ కోర్టు బయట మాత్రమే పరిష్కారం కనుగొనేందుకు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశీయ రిటైల్, ఈ-కామర్స్ బిజినెస్‌పై పట్టు సాధించాలని భావిస్తున్న రిలయన్స్ రిటైల్, అమెజాన్ మధ్య రాజీ కుదురుతుందా? అన్నది అనుమానమేనని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా .. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్
Neeraj Chopra: వందేళ్ల కల.. 23 ఏళ్ల కుర్రాడు సాకారం చేశాడు
Neeraj Chopra : నీరజ్ చోప్రా ఫిట్‌నెస్‌కు అతని బామ్మే కారణమట!