హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): సంస్థ వృద్ధిలో మానవ వనరులు కీలక పాత్ర పోషించనున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ అన్నారు. బుధవారం ఫెడరేషన్ భవన్లో ఎఫ్టీసీసీఐ హెచ్ఆర్ అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ..సానుకూల వాతావరణం ఉన్నప్పుడే ఉద్యోగులు మంచి ప్రతిభను కనబర్చుతారని, తనకు మంచి బాస్(ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్)ల వద్ద సానుకూల వాతావరణంలో పనిచేసే అవకాశం లభించిందన్నారు. మనుషులంతా ఒకే విధంగా ఉండరని, వారి-వారి ప్రతిభాపాటవాలకు అనుగుణంగా వారితో మెలగడం, వారిలోని సృజనాత్మకతను వెలికితీసి సంస్థ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయడం హెచ్ఆర్ విభాగం ప్రధాన కర్తవ్యమన్నారు. మానవ వనరుల నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే సంస్థ పురోభివృద్ధిలో పయనిస్తుందని చెప్పారు. అనంతరం హెచ్ఆర్ విభాగంలో మెరుగైన పనితీరును కనబర్చిన వివిధ కంపెనీలకు సునీల్ శర్మ అవార్డులను ప్రదానం చేశారు.