TCS on Abroad Expense | అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విదేశాల్లో ఇంటర్నేషనల్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడకం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విదేశాల్లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి చేసే ఖర్చులపై 20 శాతం టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్.. టీసీఎస్ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రతిపాదించిన 2023-24 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారత్ ఆవల ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల వాడకంపై టీసీఎస్ వసూళ్లు ఐదు శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు ప్రపతిపాదించారు. ఆర్బీఐ `లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా రూ.7 లక్షల వరకు చేసే ఖర్చుపై ఎటువంటి టీసీఎస్ వసూలు చేయరు. ఒకవేళ, విదేశీ ప్రయాణంలో ఉండగా రూ.8 లక్షలు ఖర్చు చేశారనుకుందాం.. మొత్తం ఖర్చుపై 20 శాతం టీసీఎస్ ప్రకారం రూ.1.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఖర్చు రూ.7 లక్షల కంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చయినా మొత్తం ఖర్చుపై టీసీఎస్ వర్తిస్తుంది.
ఉదాహరణకు మీ కుటుంబంతో మీరు దుబాయ్‌కి వెళ్లారనుకుందాం. క్రెడిట్ కార్డు ద్వారా రూ.10 లక్షలు చెల్లిస్తే.. టీసీఎస్ కింద మరో రూ.2 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల్లో ఏదో ఒకదాని నుంచి పేమెంట్స్ చేయొచ్చు. కానీ టీసీఎస్ నిబంధన ఒకేలా అమలవుతుంది. మీరు నేరుగా టీసీఎస్ చెల్లించనక్కరలేదు. మీరు వాడిన క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంక్‌లో మీ ఖాతా నుంచి టీసీఎస్ డిడక్ట్ అవుతుంది. టూర్ ప్యాకేజీలు, ఎన్నారైలకు గిఫ్ట్‌లు పంపినా `న్యూ` టీసీఎస్ నిబంధన వర్తిస్తుంది.
విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సు అభ్యసించే విద్యార్థికైనా, వైద్య సేవలకయ్యే ఖర్చులను కొత్త టీసీఎస్ నిబంధన నుంచి తప్పించారు. దీంతోపాటు వైద్య చికిత్స ఖర్చులు, ఇతర రోజువారీ ఖర్చులు కూడా ఇందులో ఉంటాయి. విమాన ప్రయాణ టికెట్ల బిల్లు కూడా టీసీఎస్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థి విమాన టికెట్ కోసం పంపిన మనీ, రోజువారీ ఇతర ఖర్చులు, ఫీజుల చెల్లింపులకూ ఈ నిబంధన వర్తించదు.
సంపన్నులు విదేశాల్లో ఆన్లైన్ లావాదేవీలకు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. విదేశీ కరెన్సీ కొనుగోళ్ల కోసం ప్రయత్నిస్తుంటారు. మరికొందరు హవాలా లావాదేవీలు కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో పౌరుల లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం రియల్‌టైం ఇన్ఫర్మేషన్ పొందుతుందని చార్టర్డ్ అకౌంటెంట్ అభయ్ శర్మ పేర్కొన్నారు. ఫారెక్స్ కార్డుల వాడకంతో పర్యాటకులు అదనపు ఫీజుల నుంచి మినహాయింపు పొందుతారు.
టీసీఎస్ అంటే టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. నిధుల సోర్స్ మీద పన్ను వసూలు చేస్తారని అర్థం. వ్యాపారులు, షాప్ కీపర్లు, వెండర్లు టీసీఎస్ చెల్లిస్తుంటారు. వస్తువుల విక్రయం ద్వారా కస్టమర్ల నుంచి సదరు టీసీఎస్‌ను వారు వసూలు చేస్తారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన టీసీఎస్‌ను డిపాజిట్ చేయాల్సిన బాధ్యత వ్యాపారులదే. ఆదాయం పన్ను చట్టంలోని 206 సీ సెక్షన్ ప్రకారం టీసీఎస్ వసూలు చేస్తారు. వివిధ రకాల చెల్లింపుల పరిమితి దాటినప్పుడు మాత్రమే టీసీఎస్ డిడక్ట్ అవుతుంది.