Major Changes in 2025 | మరో రెండు రోజుల్లో కొత్త వసంతంలో అడుగు పెట్టబోతున్నాం. కొత్త వసంతం తీసుకొచ్చే ఉత్సాహంతోపాటు పలు ఆర్థికపరమైన మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు మొదలు జీఎస్టీ వ్యవస్థలో కొత్త నిబంధనల వరకూ నేరుగా మధ్య తరగతి ప్రజలపైనే ప్రభావం చూపుతాయి. వాటిని గురించి తెలుసుకుందామా..?!
గృహ వినియోగ, వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు జనవరి ఒకటో తేదీ నుంచి పెరుగనున్నాయి. ఇటీవలి కాలంలో 14 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా కొనసాగుతున్నా, 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు హెచ్చు తగ్గులకు గురవుతున్నాయి. గృహ వినియోగ, కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్) ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏటీఎఫ్ ధరలకు అనుగుణంగా విమాన టికెట్ల ధరలూ పెరుగుతాయి.
ఉద్యోగు భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పెన్షనర్లు జనవరి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన తెచ్చింది. దీనివల్ల పెన్షనర్లకు పెన్షన్ విత్ డ్రా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందుకోసం అదనపు ధృవీకరణ అవసరమే లేదు. దీనివల్ల పెన్షనర్ల పెన్షన్ విత్ డ్రాయల్ ప్రక్రియ తేలికవుతుంది.
స్మార్ట్ ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ చెల్లింపుల విధానం అమల్లోకి తెచ్చింది ఆర్బీఐ. ఈ ఫీచర్ ఫోన్ల ద్వారా రోజూ రూ.5,000 నుంచి రూ.10 వేల వరకూ పేమెంట్స్ చేయొచ్చు. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నది. అలాగే ఫీచర్ ఫోన్ల నుంచి ఆన్ లైన్ చెల్లింపులు కూడా చేయొచ్చు.
వ్యవసాయ రంగానికి మద్దతుగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎటువంటి గ్యారంటీ లేకుండా రైతులు ఎకరం భూమిపై రూ.2 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఎకరానికి రూ.1.6 లక్షల పరిమితి మాత్రమే ఉండేది. వ్యవసాయ కార్యకలాపాలు, దిగుబడి పెంపు, మెరుగైన జీవన విధానం కోసం ఈ రుణాలు వాడొచ్చు.
జనవరి ఒకటో తేదీ నుంచి జీఎస్టీ పోర్టల్ యాక్సెస్ చేయడానికి వ్యాపారులు మల్టీ ఫ్యాక్టర్ అథంటికేషన్ (ఎంఎఫ్ఏ) విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఓటీపీ వంటి అదనపు ధృవీకరణ చర్యల కోసం ఈ సెక్యూరిటీ లేయర్ తీసుకొచ్చారు. చివరి 180 రోజులకు మాత్రమే ఇక నుంచి ఈ-వే బిల్లులకు సంబంధించిన డాక్యుమెంట్లు జనరేట్ అవుతాయి. కనుక కంపెనీలు, వ్యాపాులు తమ కాంటాక్ట్ వివరాలు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మల్టీ ఫ్యాక్టర్ అథంటికేషన్ కోసం తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
సెన్సెక్స్, సెన్సెక్స్-50, బ్యాంకెక్స్ ఎక్స్ పైరీ తేదీల్లో ప్రధాన మార్పు రానున్నది. సంప్రదాయంగా ఈ ఇండెక్సులు శుక్రవారాల్లో ఎక్స్ పైరీ అవుతాయి. జనవరి ఒకటో తేదీ నుంచి మంగళవారాల్లోనే ఎక్స్ పైరీ అవుతాయి. దీనికి తోడు త్రైమాసికం, అర్థ సంవత్సర కాంట్రాక్టులు తదుపరి నెల చివరి మంగళవారం ఎక్స్ పైరీ అవుతాయి. ఇక నిఫ్టీ-50లో మంత్లీ కాంట్రాక్ట్స్ గురువారం ఎక్స్ పైరీ అవుతాయి.