New rules : ఇవాళ్టితో సెప్టెంబర్ నెల ముగియనుంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచే మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో చాలా మార్పులు రానున్నాయి. మారిన నియమాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ నెంబర్‌కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని వెల్లడించాల్సిన అవసరం లేదు.
సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF ) అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
జీవిత బీమా పాలసీ, లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమిషన్, కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) కి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సక్షన్ ట్యాక్స్ (STT) అక్టోబర్ 1 నుంచి పెరగనుంది. దాంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మార్పులు ఏర్పడతాయి.