Stocks | వడ్డీరేట్ల పెంపుతో అభివృద్ధిపై భయాలు వరుసగా ఆరో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడటంతో శుక్రవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పట్టు బిగించింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 141.87 పాయింట్లు (0.24 శాతం) నష్టంతో 59,463.93 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 45 పాయింట్ల (0.26 శాతం) పతనంతో 17,466 పాయింట్ల వద్ద ముగిసింది.
ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ మధ్యాహ్నానికి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు అదానీ గ్రూప్ స్టాక్స్ శుక్రవారం కూడా నష్టాలతోనే ముగిశాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ నష్టాలు చవి చూడటంతో ఇతర స్టాక్స్ కూడా పతనంతోనే సరిపెట్టుకున్నాయి.
శుక్రవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 59,859.48 పాయింట్ల వద్ద లాభాలతో శుభారంభాన్నిచ్చింది. అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 59,908.77 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి.. తిరిగి 59,325.34 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 141.87 పాయింట్ల పతనంతో 59,463.93 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ట్రేడింగ్ 17,591.35 పాయింట్ల వద్ద మొదలై 17,599.75 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి 17,421.80 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ముగింపు సమయానికి 45.45 పాయింట్ల నష్టంతో 17,465.80 పాయింట్లతో సరిపెట్టుకున్నది. ఇదిలా ఉంటే, ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.82.68 వద్ద నిలిచింది.
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ ప్రైజెస్ 5.11 శాతం పతనంతో స్థిర పడగా, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్ స్టాక్స్ శుక్రవారం ఇంట్రా డే ట్రేడింగ్‌లో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ గ్రూప్ సంస్థల్లో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అంబుజా సిమెంట్స్ స్క్రిప్ట్‌లు లాభాలతో ముగిశాయి.
ఇంకా హిండాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ స్క్రిప్ట్‌లు భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. మరోవైపు రిలయన్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ స్టాక్స్ లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.15 శాతం పుంజుకున్నది. మరోవైపు నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మూడు శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.8 శాతం నష్టంతో ముగిశాయి.