Gautam Adani | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఒకటి తర్వాత మరొక రంగంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలోకి ఎంటరయ్యారు. ఇందుకోసం ఫ్రాన్స్ సంస్థతో టైఅప్ అయ్యారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) అనుబంధ అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎఎన్ఐఎల్)లో 25 శాతం వాటా కొనుగోలుకు ఫ్రాన్స్ ఎనర్జీ మేజర్ టోటల్ ఎనర్జీస్ అంగీకరించింది.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసర్లలో టోటల్ ఎనర్జీస్ ఒకటి. టోటల్ ఎనర్జీస్తో కలిసి భారత్లో వచ్చే 10 ఏండ్లలో 50 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులతో గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయనున్నది.
అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ కలిసి సంయుక్తంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ సృష్టిస్తామని అదానీ ఎంటర్ప్రైజెస్ ఓ ప్రకటనలో తెలిపింది. 2030 నాటికల్లా ఏఎన్ఐఎల్ ఏటా 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదుగుతుందని పేర్కొంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ స్పందిస్తూ అదానీ-టోటల్ ఎనర్జీస్ భాగస్వామ్యం వ్యూహాత్మక విలువ ఇరు సంస్థల ఆకాంక్షలు, వ్యాపార స్థాయికి అపారం అని అభిప్రాయ పడ్డారు.