న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడం సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,947గా నిర్ణయించింది. ఈ నెల 5 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 30లోగా ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది.
లాభాల్లో మెడ్‌ప్లస్
హైదరాబాద్, ఆగస్టు 2: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ విక్రయ సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.14.36 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 16 శాతం ఎగబాకి రూ.1,489 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
ఇంటింటా ఇన్నోవేటర్ గడువు పొడిగింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఇంటింటా ఇన్నోవేటర్-2024కు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రకటించింది. ఆవిష్కర్తలు తమ దరఖాస్తులను సమర్పించడానికి ఈనెల 10 వరకు అవకాశం ఉందని పేర్కొంది. ఆవిష్కరణలను 9100678543 వాట్సప్ నంబర్‌కు పంపించాలని సూచించారు.